గోస్వామి పలాస్త్రి పట్టీల వైద్యం - బండరుకే ప్రత్యేకం

గోస్వామి పలాస్త్రి పట్టీల వైద్యం - బండరుకే ప్రత్యేకం 

బందరులో 110 సంవత్సరాలకు పూర్వము నుండే, ప్రసిద్ధి చెందినది. ఈచుట్టుప్రక్కల ఎవ్వరినడిగినా టక్కున చెప్పుతారు, చింతగుంటపాలెం పట్టీల కొట్టు గురించి. 110 సంవత్సరాల క్రితం, కీర్తిశేషులు యర్రా కోటేశ్వరరావు గారు గోస్వామి అనే ఒక సన్యాసి ఉపదేశానుసారం దీనిని స్థాపించారు. 













శ్రీ యర్రా కోటేశ్వరరావు గారు, చిన్నతనం లోనే గోస్వామి గారి శిష్యరికం చేసి, ఈ పట్టిలవైద్యం గురించి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని, తానె వైద్యం చేయ మొదలెట్టాడు. మొదట్లో తమ బంధువులలో ఎవరికైనా కాళ్ళు, చేతులకు దెబ్బలు తగిలినా, విరిగినా, బెణికినా కట్టులు కట్టటం ప్రారంభించి అనతికాలంలోనే పూర్తిస్థాయి వైద్యుడనిపించుకున్నారు. అంతే! బందరు చుట్టుప్రక్కల వారికి ఈ విషయం తెలిసి శ్రీ కోటేశ్వరరావు వద్దకు వచ్చి పట్టిల వైద్యం చేయించుకో మొదలు పెట్టారు. 1910 లో చింతగుంటపాలెం సెంటరులో, గురువు గారిని జ్ఞప్తికి తెచ్చుకొనే విధంగా, "గొస్వామి పలాస్త్రి పట్టిల కొట్టు" ను ప్రారభించారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన శ్రీ కోటేశ్వరరావు గారు, పలాస్త్రి వైద్యంలో మంచి నైపుణ్యం సంపాదించారు. ఆనాడే అనేకమందికి ఉపాది కల్పించి గణుతికేక్కారు.

శ్రీ కోటేశ్వరరావు గారి తర్వాత వారి కుమారుడు పాణిగారు ఈ పట్టిల వైద్యాన్ని కొనసాగించారు. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ మంచివైద్యాన్ని అందించారు. తనతండ్రి వలన లభించిన మంచి పేరును నిలబెట్టారు. మొదట్లో ఉచితంగానే వైద్యం చేసినా, తరువాత బాధితులనే గుడ్డలు కర్రపుల్లలు తెచుకోమనేవారు.



రోజులు మారాయి.

ఇప్పుడున్న డాక్టరు యర్రా కోటేశ్వరరావుగారి మనవడే. పేరు శ్రీ యర్రా జ్ఞాన సుబ్రహ్మణ్యం గారు. ఈయన ఇంజినీరు చదివినా, పరిస్థితులు అనుకూలించక, R.M.P. చదివి డాక్టర్ అయ్యారు.  గోస్వామి పలాస్త్రి వైద్యాన్ని తన భుజస్కందాలపై వేసుకొని, తన పూర్వికుల వైద్యరితులను పాటిస్తూ, వేలకొలది రోగులకు స్వస్థత చేకూరుస్తున్నారు. ఆధునిక వైద్య రితులేన్ని వచ్చినా పలాస్త్రి వైద్యానికి ఆదరణ తగ్గలేదు. తగ్గదు అనడానికి వీరు అవలంభిస్తున్న కొన్ని ఆధునిక పద్ధతులే. ముఖ్యంగా వైద్య విధానమంతా కంప్యూటరైజ్ చేశారు. ఇదివరకైతే కాలు విరిగినా చేయి విరిగినా చేతి స్పర్స తోనూ, కంటిచూపుతోనే దానిని పరిశీలించి పట్టిలు వేసి కట్లు కట్టేవారు. అప్పుడు X-Ray ఒకచోట వైద్యం వేరొకచోట ఉండేది. ఇప్పుడు పాతరోజులు పోయాయి.  X-Ray పరికరాలు ఏర్పాటు చేశారు. కాలువిరిగినా చేయివిరిగినా నిశితంగా పరిశిలించే అవకాశం ఏర్పడింది. కరెంటు పోయినాసరే X-Ray సహా అన్ని పరికరాలు పని చేసేవిధంగా ప్రత్యేకమైన పవర్ యూనిట్ లను ఏర్పాటు చేసుకున్నారు. చేతినిండా మంచి అనుభవజ్ఞులైన పనివారున్నారు. ఇప్పుడు వైద్య ప్రక్రియ అంతా చకచకా జరిగిపోతున్నది. ఉదయం 7 గంటలు మొదలుకొని రాత్రి 8 గంటలవరకు ఉండి, చివరి రోగివరకు విలువైన వైద్యం అందించి పంపుతారు. ఇదే గోస్వామి పలాస్త్రి ప్రత్యేకత. ఈ వైద్యం పట్ల ప్రజలకున్న విశ్వాసం తగ్గలేదు. నూరు సంవత్సరాలుగా ఈ వైద్యంపై నమ్మకం పెట్టుకున్నవారు కోకొల్లలు. 













పలాస్త్రి పట్టీల వైద్యానికి మంచి ప్రచారం లభించిన సంఘటన మన ప్రియతమ మహానటులు అపర శ్రీకృష్ణులు అయిన శ్రీ ఎన్.టి. రామారావుగారి ఉదంతం. అసలే వారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో, ఏనాడో మూలన పడిన పెద్దబాలశిక్షను వెలికితీసి దుమ్ముదులిపి చదివించారు. ప్రాచీనతంటే అంత అభిమానం. అలాగే పలాస్త్రినికుడా. తను సినిమారంగంలో ఉన్నప్పుడే - భాగ్యచక్రం సినిమా పోరాట సన్నివేశాలలో గాయపడ్డారు. అప్పటి మద్రాసు లోనున్న ఆర్థోపెడిక్ వైద్యులు చేసిన వైద్యం సార్ధకం కాలేదు. అప్పుడు బందరు గోస్వామి పలాస్త్రి వైద్యులను రప్పించుకొని మూడు పలాస్త్రి పట్టిలను వేయించుకున్నారు. అంతే. శీఘ్రమే కోలుకొన్న NTR, సినిమాలో తన పోరాట సన్నివేశాలను విజయవంతంగా ముగించారు. అలా స్వయంగా తానే వైద్యం చేయించుకొని తన బందరు పట్టణానికే పురాతత్వాన్ని అంటగట్టే గోస్వామి పలాస్త్రి పట్టీల వైద్యాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇలా సామాన్యులు ధనవంతులు అన్న భేదం లేకుండా వంద సంవత్సరాలనుండి మక్కువ చూపుతున్నారు, కాబట్టే ప్రతిరోజూ 150 నుంచి 200 ల మంది, కొన్నిసార్లు 300 మంది కూడా వస్తుంటారు.
     వైద్యవిధానం : ముందుగా విరిగిన కాలు లేక చెయ్యి భాగాన్ని X-Ray తీస్తారు. సునుశితంగా పరిశీలన చేసి, విరిగిన ఎముకలను యధాస్థితిలో ఉంచి దాని చుట్టూ వనమూలికలతో తయారు చేసిన పలాస్త్రి పట్టిని అతికించి గుడ్డ చూడతారు. దానిపై సన్నని టేకు బద్దలు పెట్టి మరల గుడ్డతో గట్టిగా కట్టు కడతారు. ఇలా మూడుసార్లు పట్టీల వైద్యం చేస్తారు. అప్పుడప్పుడు మధ్యలో X-Ray తీసి పరిలించుకొని తగిన మార్పులు చేర్పులు ఉంటె చేస్తారు. బందరు చుట్టూ ప్రక్కల వనమూలికలు దొరకని కారణంగా వాటిని, విశాఖ, అరకు, చెన్నైల నుంచి తెప్పిస్తారు. చేయవలసిన విధానమంతా చెప్పి, ఈ పట్టీలను పోస్ట్ ద్వారా కూడా దూరప్రాంతాల వారికి పంపి వైద్యసేవలు నిర్వహిస్తారు.
అడ్రసు :
గోస్వామి పలాస్త్రి (పట్టిల కొట్టు), స్థాపితం : 1910
కీII శేII యర్రా కోటేశ్వరరావు గారి విగ్రహం ఉన్న పాత పట్టీల కొట్టు,
చింతగుంటపాలెం, మచిలీపట్నం -521001(కృష్ణా జిల్లా)
బస్సు రూటు : మచిలీపట్నం బస్సు స్టాండ్ నుంచి చింతగుంటపాలెం 3 కీ.మీ. దూరంమే.
డాII యర్రా జ్ఞాన సుబ్రహ్మణ్యం (Dr. Y.G. Subrahmanyam)
Ph: 08672-259855,   Cell: 9393674755 









కొన్ని ముఖ్య విషయాలు :
1) రక్తం వచ్చే గాయాలకు వైద్యం చేయరు.
మనిషిలో వెన్నెముక తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఎముక విరిగినా, చిట్లినా,బెణికినా, నరాలు తప్పినా ఈ వైద్యం చేస్తారు. రక్తం కారే గాయాలకు మాత్రం చేయరు. కట్టు కట్టిన 20 నుంచి 30 రోజుల్లోగా గాయం తగ్గుతుంది. నొప్పి అలాగే ఉంటే మరలా కట్టు కడతారు.  
2) ఆధునిక వైద్యం
రోజులు మారాయి. వైద్య ప్రక్రియలో మార్పు వచ్చినది. పట్టీలకు వాడే ఆయుర్వేద లేపనంలో మార్పులేదు. కర్ర పుల్లలు, బ్యాండేజి గుడ్డలోను చిన్న మార్పు చేసారు అంతే. ఇదివరకు విరిగిన అవయవాన్ని చేతితో పట్టుకొనిగాని నిర్ధారించేవారు. కాని ఇప్పుడు X-Ray లద్వార సులువుగా గుర్తించి కట్లు కడుతున్నారు.
ఇదివరకైతే వైద్యం ఉచితంగా చేసినా కట్లు కట్టడానికి కావలసిన గుడ్డలు, పుల్లలను రోగులనే తెచ్చుకోమనే వారు. ఇప్పుడంతా ఆధునిక సౌకర్యాలు సమకూర్చి పనులన్నీ కంప్యూటర్ ద్వారానే చేస్తున్నారు. X-Ray ఉంది. సుశిక్షితులైన సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారు. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి.
3) వేటికి కట్లు కడతారు?
ఎముకలు విరిగినా, ప్రక్కకు తొలగినా, నరాలు చెదిరినా, నడుంనొప్పి, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చే నొప్పులకు ఈ వైద్యం ద్వార ఉపశమనం దొరకుతుంది.
4) కట్లు కట్టిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు
·        కట్టు కట్టినదాన్ని స్నానం చేసే టప్పుడు తడిసినా పరవాలేదు, కాని సబ్బు రాయకూడదు, నూనే, కుంకుడురసం, షాంపు వంటి వాటిని వాడకూడదు.
·        పట్టికి దుమ్ము ధూలి, బురద తగలకూడదు.
·        పట్టీ దానంతట అదే ఊడిపోయేవరకు ఉంచాలి. నొప్పి త్వరగా తగ్గాలంటే పథ్యం చేయాలి.
·        ఎలర్జీ వలన పట్టీ వేసినతరువాత ఆ ప్రాంతంలో దురద వస్తే వెంటనే పట్టీ తీసేసి కొబ్బరినూనే రాయాలని వైద్యులు సూచిస్తున్నారు
·        అప్పుడప్పుడు కొన్నికారణాల మూలంగా రోగుల రాక కొంచెం తగ్గినా, దశాబ్దాల తరబడి ఈ వైద్యంపైనే నమ్మకం పెట్టుకున్న ఎంతోమంది తప్పకుండా వస్తున్నారు. 


అబ్బురపరిచే పలాస్త్రి వైద్యం :
ఆర్థోపెడిక్ డాక్టర్ లు కూడా నయం చేయలేని అనేకరకాల ఎముకలకు సంబంధించిన జబ్బులన్ని, కేవలం వనమూలికల ఆయుర్వేద ఔషదంతో ఇక్కడి పలాస్త్రి వైద్యులు ఆశ్చర్యం గొలిపే రీతిలో నయం చేసే చూపిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన లేపనాలతో తయారు చేయబడిన పట్టిలద్వారా వైద్య ప్రక్రియంతా అద్భుతంగా నడుస్తుంది.ఆయుర్వేద శాస్త్రసూత్రాలను ఆధారంగా చేసుకొని, మానవ శరీరంలో ఒక్క వెన్నెముక తప్ప, ఎక్కడ ఎముక విరిగినా పట్టిలు వేసి చికిత్స చేసే విధానాన్ని ఇక్కడ కొన్ని కుటుంబాల వారు దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్నారు.       
తండ్రి పాణిగారి ఆరోగ్య కారణాలవలన, సివిల్ ఇంజినీరింగ్ వృత్తిని వదులుకొని, పలాస్త్రి పట్టిల వైద్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు శ్రీ y.G. సుబ్రహ్మణ్యంగారు. తాను R.M.P. కోర్సును పూర్తిచేసిన ఆయన, నోటిద్వారా తీసుకున్న మందైతే శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రభావం చూపుతుందని, తాముచేసే ఈ పట్టిల వైద్యమైతే నొప్పి ఉన్న చోటే పట్టీ వేస్తారు కాబట్టి ఆప్రాంతం మాత్రమే ప్రభావితం చెందుతుందని డాక్టర్ గారు వివరించారు.
అప్పట్లో కొందరు అల్లోపతి వైద్యులతో,  గోస్వామి పలాస్త్రి వారు, సత్సంబంధాలు ఏర్పరచుకొన్నారు. ఆ డాక్టర్లు తమవల్ల నయంకానివి, ఇది పలాస్త్రి పట్టిలవల్ల మాత్రమే నయమౌతుందని భావించిన కేసులను గోస్వామి పలాస్త్రి వారి వద్దకు పంపేవారు. ఈ రకమైన సర్దుబాట్లు ఉభయతారకంగా జరిగేవట.
గ్రామాలనుంచి వచ్చే రైతులు యర్రా కోటేశ్వరరావు విగ్రహమున్న షాపునే గుర్తుంచుకొని మరీ వచ్చే వారట. ఎందుకంటే వీరికి మరెక్కడా బ్రాంచిలు లేవు. కొందరు పల్లెల్లో గోస్వామి పలాస్త్రి పేరు చెప్పుకొని నకిలీ పట్టిలను అమ్మి, అసలైన పలాస్త్రి వైద్యానికి కళంకం తెచ్చేవారన్నారు.
గోస్వామి పలాస్త్రి వారు, దురా భారంగా ఉన్నవారికి, వి.పి.పి. పోష్టు ద్వారా కూడా పట్టిలను పొందే సదుపాయం కలిగించారు.

కొన్ని సంవత్సరాల క్రితమే, “ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త” మొదలైన వార్తాపత్రికల వారు పలుమార్లు తమ తమ పత్రికలలో ప్రచురించి ఒక అద్భుతమైన వైద్య ప్రక్రియను ప్రజలకు పరిచయం చేశారు. వారందరికీ ధన్యవాదాలు.
                                                  ప్రాతః స్మరణీయులైన పూర్వికులు.



Popular Posts